ప్రేమ విషయంలో తల్లిదండ్రులు మందలించారని పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో,విషయం తెలిసిన ఆమె ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే,ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఆకుర్ల గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో, పాఠన్ గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న బాలిక(16) ప్రేమలో పడింది.ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు,ఈ వయసులో ఇలాంటివి వద్దని, చదువు మీద దృష్టి పెట్టాలని మందలించటంతో,ఆ బాలిక మనస్తాపానికి గురయ్యి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా ప్రియురాలు ఆత్మహత్య విషయం తెలుసుకున్న బాలుడు తను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ విషయం గమనించిన బాలుడి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.








